Virata Parvam Review : విరాటపర్వం మూవీ రివ్యూ & రేటింగ్

Virata Parvam Review : సినిమా పేరు : విరాటపర్వం

నటీనటులు : రానా దగ్గుబాటి, సాయి పల్లవి, నవీన్ చంద్ర, ప్రియమణి, నందితా దాస్, ఈశ్వరీ రావు, జరీనా వాహబ్, సాయి చంద్, తదితరులు

Advertisement

ప్రొడక్షన్ హౌస్ : సురేశ్ ప్రొడక్షన్స్, శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్

Advertisement

డైరెక్టర్ : వేణు ఊడుగుల

ప్రొడ్యూసర్స్ : సుధాకర్ చెరుకూరి, సురేశ్ బాబు

ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్

మ్యూజిక్ డైరెక్టర్ : సురేశ్ బొబ్బిలి

రిలీజ్ డేట్ : 17 జూన్ 2022

విరాటపర్వం అనే సినిమాను ఒక సినిమాగా చూడొద్దు. అది ఒక ఎమోషన్. గత వారం రిలీజ్ అయిన మేజర్ సినిమాను మనం ఎలా హత్తుకొని చూశాం.. ఎందుకంటే.. అది కూడా సినిమా కాదు.. ఒక ఎమోషన్. మేజర్ సినిమాను ఎలా చూశామో… దానిలోని సారాంశాన్ని గ్రహించామో.. విరాటపర్వం సినిమాను కూడా సగటు ప్రేక్షకుడు అలాగే చూడాలి. ఎందుకంటే.. ఇది కల్పిత కథ కాదు.. వాస్తవంగా జరిగిన కథ. వాస్తవంగా జరిగిన కథను సినిమా కోసం కొన్ని మార్పులు చేర్పులు చేసి లవ్ స్టోరీని జోడించి డైరెక్టర్ వేణు ఊడుగుల తెరకెక్కించాడు. 1990 లో జరిగిన ఓ మర్డర్ మిస్టరీ ఆధారంగా ఈ కథను రాసుకున్నాడు.

sai pallavi and rana daggubati virata parvam movie review and rating
sai pallavi and rana daggubati virata parvam movie review and rating

నిజానికి.. తెలుగులో ఇప్పటికే నక్సల్ బ్యాక్ డ్రాప్ లా చాలా సినిమాలు వచ్చాయి కానీ.. అవి అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. కొన్ని సినిమాల్లో నక్సల్స్ గురించి ప్రస్తావించినా కొద్ది సమయం మాత్రమే ఆయా సీన్లు ఉండేవి. ఇటీవల వచ్చిన ఆచార్య సినిమా కూడా అటువంటి నేపథ్యం ఉన్న సినిమానే. కానీ.. విరాటపర్వం మాత్రం పూర్తి స్థాయి నక్సలిజం నేపథ్యంలో సాగిన సినిమా. అలాగే.. అందులో ప్రేమకథను కూడా జోడించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇప్పటికే రిలీజ్ అయిన సినిమా పోస్టర్లు, ట్రైలర్, పాటలు, సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించిన సాయి పల్లవి, రానా దగ్గుబాటి వల్ల కూడా సినిమాపై అంచనాలు పెరిగాయి. కరోనా వల్ల చాలా రోజుల నుంచి వాయిదా పడుతూ వచ్చిన విరాటపర్వం చివరకు ఇవాళ రిలీజ్ అయింది. మరి.. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందో లేదో తెలియాలంటే సినిమా కథలోకి వెళ్లాల్సిందే.

Virata Parvam Review : కథ ఇదే

ఈ కథ 1970లోనే ప్రారంభం అవుతుంది. వరంగల్ జిల్లాకు చెందిన వెన్నెల జీవితమే ఈ సినిమా. సాయి పల్లవి వెన్నెలగా నటించింది. తనది నక్సలైట్లతో ముడిపడి ఉన్న జీవితం. నక్సలైట్లకు, పోలీసులకు ఎదురు కాల్పులు జరుగుతున్న సమయంలోనే తను పుడుతుంది. తన తల్లి అడవిలోనే వెన్నెలకు జన్మనిస్తుంది. తనకు పురుడు పోసి.. పేరు పెడుతుంది మరో మహిళా మావోయిస్టు. తనెవరో కాదు.. గెస్ట్ రోల్ లో నటించిన నివేతా పేతురాజ్.

కట్ చేస్తే.. వెన్నెల పెరిగి పెద్దవుతుంది. తన నేపథ్యమే నక్సలిజం అయినప్పటికీ.. తను కొన్ని పుస్తకాలు చదివి ఆ పుస్తకాల మాయలో పడిపోతుంది. ఆ పుస్తకాలన్నీ నక్సల్స్ దళ నాయకుడు అరణ్య రాసిన పుస్తకాలు. ఆయన్ను రవన్న అని కూడా పిలుస్తారు. రవన్న రోల్ లో రానా దగ్గుబాటి నటించాడు. దళ నాయకుడిగా ఉంటూనే రచయితగా మారి.. ఎన్నో పుస్తకాలను రాశాడు రవన్న. అందులో మావోయిస్టుల జీవితం, వాళ్లు ఎదుర్కునే కష్టాలు, ప్రజల కోసం వాళ్లు చేసే మంచి పనులు అన్నింటినీ అందులో రాస్తాడు రవన్న. ఆయన పుస్తకాలను చదివి ఆయనతో ప్రేమలో పడి.. ఆయన్ను కలవడానికి ఇంటి నుంచి బయటికి వచ్చేస్తుంది వెన్నెల.

రవన్న కోసం ఎక్కడెక్కడో వెతుకుతుంది. ఎన్నో కష్టాలు పడి చివరకు రవన్నను కలుస్తుంది. తన ప్రేమ గురించి అతడికి చెబుతుంది. తనను ప్రేమిస్తున్నాని చెబుతుంది. తన పుస్తకాలన్నీ చదివానని చెబుతుంది. కానీ.. ఒక లక్ష్యం కోసం పని చేస్తున్న రవన్న.. వెన్నెల ప్రేమను అంగీకరిస్తాడా? రవన్న కోసం వెన్నెల నక్సలైట్ గా ఎందుకు మారింది? చివరకు రవన్న చేతుల్లోనే ప్రాణాలు ఎందుకు కోల్పోయింది? అనే విషయాలు తెలియాలంటే సినిమాను వెండి తెర మీద చూడాల్సిందే.

సినిమా ఎలా ఉంది?

మనం ముందే చెప్పుకున్నట్టుగా ఇది ఒక ఎమోషన్ ఉన్న సినిమా. దీన్ని ఏదో ఒక నక్సలిజం సినిమా అని ముద్రవేయకుండా.. ఆ సినిమాలో ఉన్న భావోద్వేగాన్ని, ప్రేమకథను ప్రేక్షకుడు అర్థం చేసుకుంటే.. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. ఇది కల్పిత కథ కాకపోవడం వల్ల.. ఆ సంఘటనను ఆధారంగా తీసుకొని.. అసలు వెన్నెల విషయంలో ఎవరిది తప్పు.. పోలీసులదా? లేక నక్సలైట్లదా అనే విషయాన్ని చాలా భావోద్వేగంతో తెరకెక్కించాడు డైరెక్టర్.

ఇక.. సాయి పల్లవి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. తను ఎవరి కోసం అయితే వెన్నెల పాత్రను రాసుకున్నాడో.. సాయి పల్లవి మాత్రం ఆ పాత్రలో ఒదిగిపోయింది. సినిమాను తన భుజాల మీద మోసింది సాయి పల్లవి. అందుకే ఈ సినిమాకు తనే హీరో. ఇక.. దళ నాయకుడిగా, రచయితగా రవన్న పాత్రలో రానా కూడా ఒదిగిపోయాడు. తన పాత్ర మేరకు బాగానే నటించాడు. మిగితా క్యారెక్టర్స్ చేసిన నటులు కూడా తమ పాత్రల మేరకు మెప్పించారు.

ఈ సినిమాలో మాట్లాడుకోవాల్సింది మరొకటి ఉంది.. అదే సంగీతం. సురేశ్ బొబ్బిలి మ్యూజిక్ అదిరిపోయింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్బ్ గా ఉంది.

కన్ క్లూజన్

చివరగా చెప్పొచ్చేదేంటంటే.. ఈ సినిమాను ఏదో కమర్షియల్ సినిమాగా కాకుండా.. ఒక ఎమోషన్ గా చూడాలి. ఒక అమ్మాయి తన ప్రేమ కోసం ఏం చేసింది.. కేవలం పుస్తకాలు చదివి ఒక వ్యక్తిని ఎందుకు అంతగా ఆరాధించింది.. అనే అంశాన్ని మన కోణం నుంచి చూడాలి. అందుకే.. కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం కాకుండా.. ఒక నిజమైన ప్రేమకథను ఆస్వాదించాలనుకునే వాళ్లు ఈ సినిమాకు నిరభ్యంతరంగా వెళ్లొచ్చు.

యువతరం రేటింగ్ : 3.25/5

Advertisement