ఇన్నాళ్ళు సామజిక కార్యకర్తగా కలరింగ్ ఇచ్చిన బీజేపీ నేత చక్రధర్ గౌడ్ లీలలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇదివరకు దొంగనోట్ల ముద్రణ, నిరుద్యోగులను ట్రాప్ చేసి డబ్బులు వసూళ్లు చేయడంతోపాటు అత్యాచారం కేసుల్లో నిందితుడిగానున్న చక్రధర్ గౌడ్ తాజాగా కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే ఆయనకు అమ్మాయిల వ్యామోహం అధికంగా ఉన్నట్లు స్పష్టం అవుతోంది.
మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో అవినాష్ రెడ్డి కిడ్నాప్ కేసులో చక్రధర్ గౌడ్ అరెస్ట్ అయ్యారు. ఆయనతోపాటు చక్రధర్ గౌడ్ కు సహరించిన మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకెళ్ళారు. ప్రేమ వ్యవహారం, నగదు లావాదేవీలే చక్రధర్ గౌడ్ అరెస్ట్ కు కారణమని పోలీసులు స్పష్టం చేశారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. అవినాష్ రెడ్డి అనే వ్యక్తి ఆరోషిక రెడ్డి అనే యువతితో ఎనిమిదేళ్లుగా ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నాడు. తన అవసరాల కోసం అవినాష్ రెడ్డి వద్ద మొత్తంగా 25లక్షలు తీసుకున్న ఆరోషిక…కొంతకాలంగా అవినాష్ రెడ్డిని వదిలేసి బీజేపీ నేత చక్రధర్ గౌడ్ తో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తోంది. చక్రధర్ గౌడ్ కు పెళ్లి కూడా అయింది. అయినప్పటికీ మరో యువతితో లవ్ ఎఫైర్ కొనసాగించడం గమనార్హం. ఇక ఈ విషయం ఆరోషిక- చక్రధర్ లవ్ స్టొరీ అవినాష్ రెడ్డికి తెలియడంతో తను ఇచ్చిన డబ్బులను తిరిగి చెల్లించాలని ఆరోషికను డిమాండ్ చేస్తూ వస్తున్నాడు.
అవినాష్ రెడ్డికి ఇవ్వాల్సిన డబ్బుల విషయాన్ని ఆరోషిక రెడ్డి తన ప్రియుడు చక్రధర్ గౌడ్ కు వివరించింది. దీంతో ఆరోషిక ఇవ్వాల్సిన డబ్బులను తాను ఇస్తానని ఆమె వదిలేయాలని చెప్పాడు. ఘట్కేసర్‌లోని వరంగల్ హైవే దగ్గర ఉన్న వందన హోటల్ వద్దకు రావాలని, అక్కడే డబ్బులు ఇస్తానని అవినాష్ రెడ్డిని చక్రధర్ గౌడ్ నమ్మించాడు. అతని మాటలను గుడ్డిగా నమ్మిన అవినాష్ రెడ్డి హోటల్ వద్దకు చేరుకున్నాడు. ముందస్తు ప్లాన్ ప్రకారం అవినాష్ రెడ్డిని కారులో కూర్చోబెట్టుకున్న చక్రధర్ తన అనుచరులతో దాడి చేసి కిడ్నాప్ చేసేందుకు యత్నించాడు.
విషయం అవినాష్ రెడ్డికి అర్థం కావడంతో కిడ్నాపర్లను ప్రతిఘటిస్తూ కేకలు వేశాడు. దాంతో స్థానికులు పరుగెత్తుకు రావడంతో చక్రధర్ గౌడ్ అనుచరులు అక్కడి నుంచి పరుగులు తీశారు. అనంతరం నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు చక్రధర్ గౌడ్ తోపాటు అనుచరులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చక్రధర్ బాగోతం ఒక్కొక్కటికి బయటకు వస్తుండటంతో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే ఒత్తిళ్ళు బీజేపీ హైకమాండ్ పై పెరుగుతున్నాయి.
Also Read : బాలికపై పూర్ణానందస్వామి అత్యాచారం – తేల్చిన పోలీసులు..!!