డిక్లరేషన్లతో కాంగ్రెస్ కు ఆదరణ – తెలంగాణలో ఆశలు రేపుతోన్న రేవంత్..?

ఓ వైపు సీనియర్లు రేవంత్ కు సహాయ నిరాకరణ చేస్తున్నా రేవంత్ మాత్రం వాటిని పట్టించుకోకుండా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. డిక్లరేషన్ ల పేరుతో సభలను ఏర్పాటు చేసి హైకమాండ్ పెద్దలను రప్పించి సభలను సక్సెస్ చేస్తున్నారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి పెద్ద దిక్కు అనే అభిప్రాయాన్ని ఢిల్లీ పెద్దల్లో కల్పిస్తున్నారు. రేవంత్ కున్న మాస్ క్రేజ్ చూసి ఢిల్లీ పెద్దలు కర్ణాటక తరువాత తెలంగాణపై ఫోకస్ చేయాలని… తెలంగాణ కూడా కాంగ్రెస్ హస్తగతమయ్యే అవకాశాలు ఉన్నాయని నమ్ముతున్నారు.

Advertisement

గతంలో వరంగల్ లో రైతు డిక్లరేషన్ ను రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి ప్రకటింపజేశారు. అందులో కీలకమైన ధరణి పోర్టల్ రద్దు అంశం ఉంది. ఈ హామీ రైతులను, భూవివాదాలతో చిక్కులు ఎదుర్కొంటున్న ఎంతోమందిని ఆకర్షించింది. కాంగ్రెస్ వైపు తొంగిచూసేలా చేసింది. రైతు డిక్లరేషన్ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలా రేవంత్ ప్రత్యేక కార్యచరణ తీసుకొని ముందుకు సాగారు. ఇప్పుడు ప్రియాంక గాంధీతో యూత్ డిక్లరేషన్ ప్రకటింపజేశారు. నిరుద్యోగులకు ప్రతి నెల రూ.4వేల నిరుద్యోగ భృతి, విద్యార్థినిలకు ఫ్రీగా ఎలక్ట్రిక్ స్కూటీ , ప్రైవేట్ పరిశ్రమల్లో స్థానిక యువతకు 75శాతం ఉద్యోగ అవకాశాలు, అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగులకు పది లక్షల వడ్డీ లేని ఋణం… ఇలా యువతకు గుక్క తిప్పుకోలేనన్ని ఆపర్లు ఇచ్చారు.

Advertisement

బీఆర్ఎస్ పై తీవ్ర అసంతృప్తితోనున్న తెలంగాణ విద్యార్ధి, నిరుద్యోగ లోకానికి కాంగ్రెస్ ప్రకటించిన యూత్ డిక్లరేషన్ నిజంగా భరోసా కల్పించేదే. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను చూస్తే యువతను టెంప్ట్ చేసేలానే ఉన్నది. దీంతో కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో విద్యార్ధి, నిరుద్యోగ ఓటు బ్యాంక్ ను గంపగుత్తగా ఖాతాలో వేసుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే…కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఆకర్షనీయంగా ఉన్నాయి కానీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎవరు సీఎం అవుతారో..? ఇచ్చిన హామీలకు ఎవరు బాధ్యత తీసుకుంటారోనని అనుమానం తెలంగాణ యువతలో ఉండేది .

ఇదే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ప్రజల్లోకి వెళ్ళకపోవడానికి కారణమైంది. అందుకే రేవంత్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను తెరపైకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇచ్చిన హామీలను అమలు చేసే బాధ్యత మాదని వారు ప్రకటించడంలోనే రేవంత్ వ్యూహం ఉందని అర్థం అవుతోంది. సీనియర్లు రేవంత్ దూకుడును అడ్డుకోవాలని చూసినా రేవంత్ మాత్రం తన పని తాను చేసుకుంటూ పార్టీలో పట్టు బిగిస్తున్నారు. యూత్ డిక్లరేషన్ ద్వారా రేవంత్ కాస్త పైచేయి సాధించారని క్లియర్ గా అవుతోంది.

Advertisement