బీజేపీలో బిగ్ వికెట్ -టీడీపీలోకి రాజాసింగ్ ..!?

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీని వీడనున్నారా..? ఆయన తిరిగి సొంతగూటికి చేరనున్నారా..? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది.

Advertisement

రాజాసింగ్ బీజేపీకి గుడ్ బై చెప్పనున్నట్లు పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆయన సొంతగూటికి వెళ్లేందుకు రెడీ అయ్యారని చర్చ విస్తృతంగా సాగుతోంది. తనను సస్పెండ్ చేసి ఆరు నెలలు దాటినా బీజేపీ హైకమాండ్ రాజాసింగ్ సస్పెన్షన్ ను ఎత్తివేయకపోవడంతో ఆయన మనస్తాపానికి గురయ్యారని.. అదే సమయంలో పార్టీలో గ్రూప్ రాజకీయాలు కూడా నచ్చకే బీజేపీని వీడాలని రాజాసింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారని రాజాసింగ్ సన్నిహిత వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

Advertisement

రాజాసింగ్ 2009లో జీహెచ్ఎంసి ఎన్నికల్లో టీడీపీ తరుఫున పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం బీజేపీలో చేరిన ఆయన 2014ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2018ముందస్తు ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో బీజేపీలోని హేమాహేమీలైన నేతలంతా ఓటమి పాలైతే కేవలం రాజాసింగ్ మాత్రమే బీజేపీ తరుఫున ఎన్నికయ్యారు. దీంతో పార్టీలో ఆయనకు ప్రాధాన్యత పెరిగింది. ఆ తరువాత ఉప ఎన్నికలు రావడంతో ఇద్దరు నేతలు బీజేపీ తరుఫున అసెంబ్లీకి ఎన్నిక కావడంతో రాజాసింగ్ కు ప్రాధాన్యత తగ్గుతూ వచ్చిందన్న భావనలో ఆయన అనుచర వర్గం ఉంది.

ఈ నేపథ్యంలోనే ఓ వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో రాజాసింగ్ జైలుకు వెళ్ళారు. దాంతో ఆయన్ను పార్టీ సస్పెండ్ చేసింది. ఆరు నెలలు గడుస్తున్నా ఆయనపై సస్పెన్షన్ రద్దు చేయకపోవడంతో పార్టీ మారేందుకు రాజాసింగ్ సన్నధం అయ్యారని తెలుస్తోంది. టీడీపీలో చేరేందుకు రాజాసింగ్ రెడీ అయ్యారని.. ఇందులో భాగంగానే రెండు రోజుల కిందట టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ను కలిసి చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది.

గోషామహల్ తోపాటు గ్రేటర్ లో మరో మూడు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపుకు సహకరిస్తానని రాజాసింగ్ హామీ ఇచ్చారని అయితే, పార్టీ అధినాయకత్వంతో మాట్లాడి పార్టీలోకి ఆహ్వానించే ఏర్పాట్లు చేస్తామని కాసాని చెప్పినట్లు రాజాసింగ్ వర్గం చెప్పుకుంటుంది.

Advertisement